శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఫ్రంట్ ఛైర్మన్ బాలగొని బాల రాజ్ గౌడ్ , కన్వీనర్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ , బీజేపీ, బి ఆర్ ఎస్ పార్టీలను రాజకీయంగా బొంద పెట్టాలన్నారు. చట్టాలు చేసే చట్ట సభలలో మాట్లాడకుండా గల్లీలో చెడుగుడు ఆడుతున్నారని, ప్రజాధనాన్ని కాంగ్రెస్, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను నయా వంచన చేస్తూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని, గ్లోబల్ సమ్మిట్, మెస్సీ ఆటలతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. బీసీలకు ఉద్యోగ, ఉపాధిలో భాగస్వామ్యం ఎంతో తేల్చాలని, రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు తెస్తున్నామని చెప్పి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్ లో బీసీ 42 శాతం రిజర్వేషన్ బిల్లును 9 వ షెడ్యూల్ లో ఆర్టికల్ 243 ప్రకారం తమిళనాడు తరహా చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య, అంబాల నారాయణ గౌడ్, బైర్ల శేఖర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.






