శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మంజీర పైప్ లైన్ రూట్ లో ని ఈర్ల చెరువు పార్క్ అనారోగ్యకరమైన పరిస్థితుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ మాధవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి కోసం మేయర్ విజయలక్ష్మి దత్తత తీసుకున్నప్పటికీ పనులు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. డ్రైనేజీ నీరు నేరుగా చెరువులోకి చేరుతుందని, దీంతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. చెరువును సంరక్షించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే అని, డ్రైనేజీ నీటిని నేరుగా చెరువులో కలిపేస్తున్నారని అన్నారు. దీంతో భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ప్రజలు తాగునీటికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వాకింగ్ ట్రాక్ లేదని, అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నారని, వాకింగ్ ట్రాక్ పూర్తిగా ధ్వంసమై, ప్రజలకు వాడే పరిస్థితి లేదని అన్నారు. మంజూరైన నిధులు ఎక్కడా కనిపించకుండా, కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చెరువు వద్ద అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, బీర్ బాటిళ్లతో ప్రాంగణం నిండిపోయింది. పర్యావరణ పరిరక్షణ అనే మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. అభివృద్ధి లేకపోవడం ఒక్కటే కాదు, పార్క్ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి. ఎటు చూసినా బీర్ బాటిళ్లు, చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, చెరువు పునరుద్ధరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ నిరంజన్ , చందా నగర్ డివిజన్ అధ్యక్షుడు బి అరుణ్ కుమార్, చందా నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఉలిసి శ్రీనివాస్ రావు , మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు హరి నాయక్, రమా రాహుల్, వివిధ కో ఆర్డినేటర్ లు, నాయకులు, జన సైనికులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.