జూబ్లీహిల్స్ (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స పరిధిలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం షిపాహి పేరిట తొలి మహిళా పోలీసు వార్షిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు సినీ నటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె ఉత్తమ సేవలను అందించిన పలువురు మహిళా పోలీసులు, మహిళలకు అవార్డులను అందజేశారు. అలాగే నూతనంగా పోలీసు ఉద్యోగంలో చేరిన మహిళలతో ఏర్పాటు చేసిన 4 కొత్త డయల్ 100 వాహనాలను కూడా ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు ఇవ్వాలే గానీ వారు ఏ రంగంలో అయినా రాణిస్తారని అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 750 మంది మహిళలు పలు విభాగాల్లో పనిచేస్తున్నారని, వారిలో కొందరు ఫీల్డ్‌లో సైతం తిరుగుతున్నారని, కొందరు డిటెక్టివ్‌లుగా పనిచేస్తున్నారని అన్నారు. కొందరు కొత్తగా డయల్ 100 వాహనాల్లో డ్రైవర్లుగా చేరారని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ అవకాశం కల్పించాలని, వారు రాణిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వుమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డీసీపీ అనసూయ, వోటరీ టెక్ ప్రతినిధి సంజయ్ కంబం, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, డీసీపీలు పద్మ, వెంకటేశ్వర్లు, ఏడీసీపీలు కవిత, ఇందిర, లావణ్య, మాణిక్ రాజ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.