ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమమే

  • కోకాపేట్ లో స్థలం మారిస్తే సహించం
  • తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్

నాగర్‌క‌ర్నూలు (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సగర జాతిని అవమానించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ అన్నారు. గురువారం నాగర్‌క‌ర్నూలు పట్టణంలోని రూబీ గార్డెన్ లో జరిగిన జిల్లా సగర సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న శేఖర్ సగర

సీఎం కేసీఆర్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం సగర జాతికి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేట్ లో 2 ఎకరాల భూమిని మంజూరు చేసిందని, మొదట ఇచ్చిన స్థలాన్ని మార్చి అన్యాయం చేయాలని ప్రభుత్వంలోని కొందరు అధికారులు కుట్రలు చేసి లే-అవుట్ మార్చారని అన్నారు. మొదట‌ ఇచ్చిన స్థలాన్ని మార్చి నిర్ణయం కొనసాగిస్తే తమ కులాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

లేబర్ కార్డుల ఆవశ్యకత గురించి ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

గతంలో ఇచ్చిన జీవో 29 ని మార్చి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని, ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో ఈఎండీలు మినహాయించి 50శాతం పనులను తమ కులానికి కేటాయించే విధంగా ప్రభుత్వం జీవోను విడుదల చేయాలని అన్నారు. కుల వృత్తి పై ఆధారపడి రోజు కూలీలుగా పని చేస్తున్న సగరుల జీవితాలు బాగుపడాలంటే ఫెడరేషన్ లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.

నాగర్‌క‌ర్నూలు జిల్లా సగర సంఘం నాయకులతో రాష్ట్ర నాయకులు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ సగర, చిలుక సత్యం సగర, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దేవన్న సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి సందుపట్ల రాము సగర, నాగర్ కర్నూల్ గౌరవ అధ్యక్షుడు వావిలాల భీమయ్య సగర, అధ్యక్షుడు ఆవుల భాస్కర్ బాబు సగర, కోశాధికారి బాబు సగర, రాష్ట్ర యువజన నాయకుడు నార్లకంటి నరేందర్ సగర, జిల్లాలోని మండల గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here