నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని పురస్కరించుకొని హైదర్ నగర్ డివిజన్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల వయసుల్లోనే మన్యం ప్రజలను కలుపుకుని బ్రిటీషు పాలనను ఎదిరించిన గొప్ప యోధుడన్నారు. సాయుధ పోరాటంతోనే పరాయి పాలన నుంచి విముక్తి లబిస్తుందని నమ్మి తెల్లదొరల పైకి విల్లు ఎక్కుపెట్టిన అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ స్పూర్తిదాయకం అన్నారు. అతి చిన్న వయసులోనే ఆంగ్లేయులకు కంటిమీద కునుకు లేకుండా చేసి గడగడలాడించిన దైర్యశీలి అన్నారు. అల్లూరిని ఆదర్శంగా తీసుకుని గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు అందరూ కృషి చేయాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, కాంతారావు, అరుణ్ కుమార్, నవీన్ గౌడ్, నరసింగరావు, మణిభూషన్, సీతారామరాజు, ఆంజనేయులు, కృష్ణ, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.