వినికిడి లోపం ఎలాగైనా రావ‌చ్చు.. తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్‌..

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రపంచ చెవిటి అవేర్‌నెస్ వారోత్సవాల‌ను పురస్కరించుకొని చందానగర్ పరిధిలో ఉన్న న్యూ గుడ్ షెఫర్డ్స్ చెవిటి మూగ పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ చెవిటి అవేర్‌నెస్ వారోత్సవాల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందానగర్ లోని స్మిత దంత వైద్యశాల వైద్యుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, మందులు, పేస్టులు, బ్రష్‌లు అందజేసి, దంత సంరక్షణపై పలు సూచనలు చేశారు.

విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు చేస్తున్న డాక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్ రెడ్డి

ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ, వినికిడి లోపం పుట్టుకతో లేదా ఎప్పుడైనా రావచ్చునని, ఒకటి లేదా రెండు చెవులలో వినికిడి లోపము సంభవించవచ్చున‌ని, వినికిడి లోపం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉండవచ్చ‌ని అన్నారు. కొన్ని అంటు వ్యాధుల వలన, పుట్టుకతో వచ్చే సమస్యల వలన, చెవికి గాయాలు అవడం వలన, కొన్ని మందులు లేదా టాక్సిన్స్ వలన, వినికిడి లోపం రావచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారని అన్నారు. పరీక్షలో కనీసం 25 డేసీబుల్స్ వినలేడని కనుగొన్నప్పుడు వినికిడి లోప నిర్ధారణ జరుగుతుంద‌ని పేర్కొన్నారు.

ప్రజా ఆరోగ్య సమస్యలు మెరుగుపరచడం ద్వారా సగం వినికిడి లోపాన్ని నివారించవచ్చు. బదిరిలు తమ భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరుస్తారు. మన దేశంలో బదిరిలు అందరూ ఇండియన్ సైన్ లాంగ్వేజెస్, రీజినల్ సైన్ లాంగ్వేజెస్ ఉపయోగించుకొని విద్యను అభ్యసిస్తున్నారు. బదిరిలకు సానుభూతిని చూపించడం కంటే, చేయూతనందించడంలో వారు ఎంతో సంతృప్తిని పొందుతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఐక్యరాజ్యసమితి వారు ఈ లాంగ్వేజ్ కి గుర్తింపు తేవడానికి ఈ వారాన్ని సైన్ లాంగ్వేజెస్ వారోత్సవంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థుల‌కు పండ్లు, బిస్కెట్ల‌ను పంచిన తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్

బధిరులందరూ ఈ సైన్ లాంగ్వేజెస్ ని ఉపయోగించుకొని ఇష్టపడి కష్టపడి చదువుకొని, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. తదనంతరం వారికి పండ్లు, బిస్కెట్లు, అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మెర్సి, ఉపాధ్యాయురాలు శోభ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్,కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వరరాజు, అమ్మయ్య చౌదరి, శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here