- వినాయక నవరాత్రులలో ఇతరులకు స్పూర్తిగా నిలిచిన హఫీజ్ పేట్ గ్రామ యువత
నమస్తే శేరిలింగంపల్లి: ఆధ్యాత్మికతతో పాటూ సమాజ సేవలోనూ పాలు పంచుకుంటున్నారు ఆ యువకులు. ప్రతి పౌరుడు ఒక సైనికుడేనని నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాలలో మనదేశం అభివృద్ధిలో ముందుండాలంటే మన గ్రామం నుంచే అది సాధ్యమవుతుందని తమవంతు సందేశం ఇస్తున్నారు హాఫీజ్ పేట్ గ్రామ యువకులు. వినాయక మహోత్సవంలో భాగంగా నియమ, నిష్టలతో (పాదరక్షలు ధరించకుండా, ఒక పూట భోజనం) పూజలు చేస్తూ మండపంలోనే నిద్రించారు. అంతేకాదు ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 వసంతాల స్వతంత్ర భారతమాత సేవలో, స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయని వీరులను, ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రతి ఒక్కరిని స్మరించుకున్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ డెబ్బై అయిదు సంవత్సరాలుగా రక్షణ కల్పిస్తున్న ఆర్మీ సైన్యానికి, అన్నదాతలకు అభివందనం చేస్తూ వారిలోని దేశభక్తిని ఎలుగెత్తి చాటారు ఈ పదిహేను మంది యువకులు. వినాయక నిమజ్జన కార్యక్రమం మధ్యలో వేలాది మంది సమక్షంలో జాతీయ గీతాలాపన చేసి అందరిని ఆకట్టుకున్నారు హఫీజ్ పెట్ హనుమాన్ యూత్ సభ్యులు. వీటితోపాటు మనవంతు బాధ్యతగా చెత్తను చెత్త బండిలోనే వేద్దామని, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ ను నిషేధించాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షిద్దామని పిలుపు నిస్తున్నారు.