హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మయం: బోయిని మహేష్ యాదవ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వివిధ సమస్యలపై చందానగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కి బీజేపీ నాయకులు, కాలనీ వాసులతో కలసి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మయంగా మారింద‌ని అన్నారు. ఎన్ని సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన అధికారులు వచ్చి చూసి పోవడం తప్ప ఎక్కడ వేసిన గొంగడి అక్క‌డే అన్న చందంగా సమస్యలు అలాగే ఉన్నాయ‌ని అన్నారు. శానిటేషన్ చాలా అధ్వాన్నంగా ఉంద‌ని, హఫీజ్ పేట్ లోని శ్మ‌శానవాటిక స్థాపన జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయిన కనీసం ఇప్పటి వరకు కూడా కొంత పనులు కూడా పూర్తి చేయలేకపోవడం సిగ్గు చేట‌ని అన్నారు.

డివిజన్ పరిధిలో వర్షాలు కురిస్తే ఇప్పటికి కొన్ని ప్రాంతాలు నీటిమయం అవుతున్నాయ‌ని. ఆ ప్రాంతాల్లో అధికారులు, నాయకులు సమస్యలు ఉన్నప్పుడు చూసి పోవడమే తప్ప ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలను పరిష్కరించలేకపోవడం ఇటు అధికారులకు అటు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక‌పోవ‌డాన్ని నిరూపిస్తుంద‌ని అన్నారు. మదీనాగూడ గ్రామంలో ప్రతి సంవత్సరం మహిళలు బ‌తుక‌మ్మ స‌మ‌యంలో నిమ‌జ్జ‌న స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నార‌ని, మదీనాగూడ పరిధిలో అనేక చెరువులు ఉన్నా ఎక్కడ కూడా నిమజ్జనం కొలను లేద‌ని, అధికారులు ఈ సమస్యపై స్పందించి బతుకమ్మల‌ను వేయటానికి ఈల్ల చెరువులో కొలను నిర్మించాలని అన్నారు. ఈ సమస్యలను అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్ , సురేష్ కురుమ, శివ ముదిరాజ్, దేవేందర్ దాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here