అంగరంగ వైభవంగా ఇస్కాన్ సైబరాబాద్ ఆలయ నిర్మాణ భూమి పూజ

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం పక్కన నూతనంగా నిర్మించనున్న ఇస్కాన్ సైబరాబాద్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో ఆలయం, వేద పాఠశాల, గోశాల, మెగా కమ్యూనిటీ కిచెన్ షెడ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. గోపనపల్లి గ్రామంలో ఇస్కాన్ సంస్థ సుమారు 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆలయం, వేద పాఠశాల, గోశాల, మెగా కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం జరగడం ద్వారా భక్తుల సంక్షేమం, సాంస్కృతిక విలువల పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవకు ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు, మహిళలు, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here