శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి కామాక్షి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో స్వరార్చన నిర్వహించారు. పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. కామాక్షి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ గురువులు సీత దేవిక ద్రోణంరాజు, వక్కలంక సౌజన్య మార్గదర్శకత్వంలో కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురుదేవతా స్తుతితో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మేలుకొనవే నీలమేఘ, ఆదిమూర్తి యీతడు, మత్స్య కూర్మ వరాహ, అంగనకు నీవె, రామ రామచంద్ర, కొలువై వున్నాడు, ఇందరికీ అభయంబు, ఎట్టు గూడె పెండ్లి, శరణు శరణు సురేంద్ర, పెరిగినాడు చూడరో, నారాయణాచ్యుతానంత, ఈతడే ముక్తి దోవ, లాలి శ్రీ కృష్ణయ్య తదితర అన్నమాచార్య సంకీర్తనలను శ్రుతి–లయ సమన్వయంతో ఆలపించి భక్తులను ఆకట్టుకున్నారు. సీత దేవిక ద్రోణంరాజు, వక్కలంక సౌజన్యతో పాటు చింత లక్ష్మీ శ్రీ వైష్ణవి, దిల్లీ సుమ, పడకంటి రిద్ధి, కొరివి లలిత, సాన్విత్ రాచూరి, కర్రె విష్ణు ప్రియ, మోనిక చొల్లేటి, సహస్ర మంత, తిమ్మరాజు చంద్రిక, సి. ఆరాధ్య, ఎం.వి.ఎస్. సాయి శ్రుతి, నందన కృతి సత్యవోలు, పవని పొలోజు, విదుల రాయబండి, శ్రేష్ఠ ద్రోణంరాజు, మహాలక్ష్మి ద్రోణంరాజు తదితరులు స్వరార్చనలో పాల్గొన్నారు.
శిష్యుల గానంలో అన్నమయ్య సాహిత్యంలోని భక్తి, మాధుర్యం, ఆధ్యాత్మిక భావాలు ప్రతిధ్వనించాయి. శ్రీనివాస్ కీబోర్డుపై, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని ప్రతినిధులు గురువులు, కళాకారులను అభినందించారు. అన్నమయ్య సంకీర్తనలను భావపూర్వకంగా ఆలపిస్తూ భక్తి సంగీత పరంపరను కొనసాగిస్తున్న కామాక్షి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కృషిని ప్రశంసించారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ డా. శోభారాజు, మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ పాల్గొన్న కళాకారులకు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారి జ్ఞాపికలను అందించి సత్కరించారు. కార్యక్రమం ముగింపులో స్వామివారికి అంగనలీరే మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.





