శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్‌లో ఉన్న తాజ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ విజయ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపదలను తొలగిస్తూ భక్తులకు అభయాన్ని ప్రసాదించే శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ విజయ గణపతి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నూతన దేవాలయాల నిర్మాణం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందించేందుకు ఆలయాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి, సామాజిక ఐక్యతకు కేంద్రబిందువులుగా నిలుస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రజలందరూ ఐకమత్యంతో సహకరించాలని కోరారు. దేవాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ నాయక్‌తోపాటు సీనియర్ నాయకులు శేఖర్, సుమన్, వేణు, రంగస్వామి, శ్రీశైలం, వెంకటేష్, ధర్మ, కృష్ణ, నాగేష్, వెంకన్న, నాగరాజు, సిద్దు, సాయి, దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, పిల్లలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





