శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.53,24,150 ఆర్థిక సహాయాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 84 మంది బాధిత కుటుంబాలకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర వైద్య చికిత్స అవసరమైనప్పటికీ ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, అభాగ్య కుటుంబాలకు CMRF ఆపన్నహస్తంగా నిలుస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని గాంధీ స్పష్టం చేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, ఉరిటి వెంకట్ రావు, DSRK ప్రసాద్, MD ఇబ్రహీం, జిల్లా గణేష్, మారెళ్ల శ్రీనివాస్, చంద్రమోహన్ సాగర్, అష్రఫ్, బాషా తదితరులు పాల్గొన్నారు.





