శేరిలింగంపల్లి, ఆగస్టు 31 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను దూరం చేశాయని ఏఐఎఫ్ డివై రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు పెద్దారపు రమేష్ ఆరోపించారు. మియాపూర్ ముజాఫర్ అహ్మద్ నగర్ లో జరిగిన ఏఐఎఫ్ డివై రాష్ట్ర కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను అవలంబిస్తూ ప్రజల కొనుగోలు శక్తిపై కొరడా ఝులిపించడం ద్వారా సాధారణమైన ప్రజలకు విద్య వైద్య అంగడి సరుకుగా మారాయని ఆరోపించారు. సామాన్యులకు ప్రభుత్వ హాస్పటళ్లలో, పాఠశాల, కళాశాలలో నాణ్యత లోపించడానికి, ప్రైవేటు యాజమాన్యం విద్య వైద్య రంగాలలో వ్యాపార ధోరణితో తమ సంపాదనను పోగు చేసుకోవడానికి పాలకవర్గాలు సహకరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గడచిన పదకొండ్నర సంవత్సరాలలో ఉద్యోగాల భర్తీ పేరుతో కాలయాపన చేసి యువతను మూఢవిశ్వాసాల పంజరంలో బంధించిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని అన్నారు.

అనంతరం ఏఐఎఫ్ డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ మాట్లాడుతూ మద్ది కాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో విద్యా వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలో నడపాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని తలపెట్టామని అన్నారు. సెప్టెంబర్ 28న షాహిద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఏఐఎఫ్ డివై రాష్ట్ర నిర్మాణ ప్లీనరీ హైదరాబాద్ ఓంకార్ భవన్ లో జరపాలని, ప్రస్తుతం వర్షాకాలం లో సీజన్ వ్యాధులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం అందరికీ ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందేతట్లు ప్రభుత్వం పై డిమాండ్ చేస్తూ కార్యక్రమం తీసుకోవాలని సమావేశం నిర్ణయం చేసినట్టు వెల్లడించారు. ఏఐఎఫ్ డివై రాష్ట్ర అధ్యక్షుడు కర్ర రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద రవి, రాష్ట్ర కోశాధికారి డి మధుసూదన్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఎండి సుల్తానా బేగం, జక్క అశోక్, పరిమళ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.





