నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం చెరువులో జరుగుతున్న సుందరికరణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ. 31.26 కోట్లతో గంగారాం పెద్ద చెరువు, పటేల్ కుంట చెరువు సుందరికరణ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులలో జాప్యం తగదని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. అదేవిదంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువులను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ గారు పేర్కొన్నారు. చెరువు అపరిశుభ్రం వల్ల గుర్రపు డెక్క పెరిగిపోయిందని, తద్వార దోమలు వృద్ధి చెందడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చెరువు సుందరీకరణతో ఆ ఇబ్బందులు దూరమవుతాయని అన్నారు. నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని, చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






