సైబరాబాద్‌లో ట్రాఫిక్, రోడ్లపై ఫోకస్.. 334 పనులపై అధికారుల సమీక్ష

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ట్రాఫిక్ సమస్యలు, రహదారి మౌలిక వసతులు, వర్షాకాల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్, సీఎంసీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని పెండింగ్ పనులు, కీలక సమస్యలపై సమీక్షించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, సీఎంసీ కమిషనర్ సృజన, FCDA కమిషనర్ శశాంక, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్ తోపాటు వివిధ జోన్ల జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో సైబరాబాద్ పరిధిలోని 334 రహదారి మౌలిక వసతుల పనులను సమీక్షించారు. ఇందులో 245 ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత పనులను గుర్తించారు. అలాగే 25 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల (FOB) పనులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇతర అంశాల్లో 65 సైన్‌బోర్డులు, ఇల్యూమినేషన్ పనులు, 9 రహదారి ఆక్రమణ ప్రాంతాల్లో తక్షణ చర్యలు, 53 ఫుట్‌పాత్, జంక్షన్ పనులు, 13 రహదారి విస్తరణ ప్రతిపాదనలు సమీక్షించారు. అదేవిధంగా వర్షాకాలంలో నీరు నిలిచే అవకాశం ఉన్న 85 ప్రాంతాలను కూడా అధికారులు పరిశీలించారు. గుర్తించిన సమస్యలపై సంబంధిత శాఖలు వెంటనే క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించాలని, పరస్పర సమన్వయంతో నిర్దేశిత కాలపరిమితిలో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాదచారుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, వర్షాకాల సన్నద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

చేపట్టిన పనులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సైబరాబాద్‌లో ట్రాఫిక్, రహదారులు, వర్షాకాల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వివిధ శాఖల మధ్య కన్వర్జెన్స్ విధానాన్ని కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here