శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని మియాపూర్ కాంగ్రెస్ యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఓటర్ల నమోదు, వివరాల ధ్రువీకరణ, సవరణ తదితర ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించారు. SIR కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటర్ల జాబితాలో ఉండేలా అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఉదయ్ కిరణ్ సూచించారు. ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన ప్రజాస్వామ్య హక్కు అని ఆయన పేర్కొన్నారు.

SIR ప్రక్రియలో ప్రతి అర్హ ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకూడదని అన్నారు. ఆగస్టు 10నే SIR నమోదు, ధ్రువీకరణకు చివరి తేదీ అని గుర్తుచేస్తూ.. అర్హులైన ఓటర్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా గడువులోపు ఎన్యుమరేషన్ ఫామ్‌ను సమర్పించాలని ఉదయ్ కిరణ్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శరత్, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, రత్నాచారి, నాగసాయి, సాయి నిఖిల్, రామ్, భువనేశ్వర్తోపాటు BLOలు, BLAలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతి అర్హ ఓటు నమోదు కావాలి.. ప్రతి ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అని యలమంచి ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు.





