శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి బీహెచ్ఈఎల్ టౌన్షిప్లోని పెద్దమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అనంతరం వేముకుంట శ్రీ లలితా పోచమ్మ తల్లి దేవాలయం, గంగారం గ్రామంలోని పోచమ్మ దేవాలయం, ఎడమ్మ దేవాలయం, శాంతినగర్ ఎల్లమ్మ దేవాలయం, పాపిరెడ్డి కాలనీ మహంకాళి దేవాలయం, ఎల్లమ్మ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లోనూ నాయకులు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు నాయకులు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇటువంటి పండుగలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






