యువ‌త‌ ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి: జగదీశ్వర్‌ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మారుతున్న సాంకేతికత యువతకు గతంలో ఎన్నడూ లేనన్ని అవకాశాలను అందుబాటులోకి తెస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్‌ గౌడ్‌ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్‌ సాంకేతికత, నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకుని యువత తమ ప్రతిభకు పదును పెట్టాలని సూచించారు. గచ్చిబౌలిలోని డ్రేపర్‌ స్టార్టప్‌ హౌస్‌లో నిర్వహించిన ఫౌండర్‌ ఫోర్జ్‌ఎక్స్‌-జర్నీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (ఎపిసోడ్‌–2) కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. తాము చదువుకునే రోజుల్లో ఇన్ని అవకాశాలు అందుబాటులో లేవని, ప్రస్తుతం సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా తమ ఆలోచనలకు వ్యాపార రూపమిచ్చి స్టార్టప్‌లను స్థాపించాలని జగదీశ్వర్‌ గౌడ్‌ సూచించారు. తద్వారా యువత స్వయంగా ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగవచ్చన్నారు. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, బృందంగా పనిచేయడం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానానికి ఆచరణాత్మక అనుభవాన్ని జోడించుకోవాలని చెప్పారు. డ్రగ్స్‌, గుట్కా, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని యువతకు పిలుపునిచ్చారు. వైఫల్యాలను ఎదురుదెబ్బలుగా కాకుండా అనుభవాలుగా మలుచుకుని, విజయం సాధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడుతున్నారని, యువత సాధించే విజయమే వారి శ్రమకు తగిన ప్రతిఫలమని జగదీశ్వర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టమైన దృష్టితో ముందుకు సాగి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేఎల్‌ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here