శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జగద్గిరిగుట్టలోని సంస్కృతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డమీది బాలరాజు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన సత్కారం అందుకోనున్నారు. 1999లో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం బాలరాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ బోటనీ, బీఎడ్ పూర్తి చేశారు. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బోటనీ లెక్చరర్‌గా కూడా పనిచేశారు.

బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప, కూన మహాలక్ష్మినగర్ ప్రాంతంలో సంస్కృతి పాఠశాలను స్థాపించారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. స్థానికంగా పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. విద్యాబోధనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాలరాజు చురుకుగా పాల్గొంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన కుర్చీలు, వంట సామగ్రిని అందిస్తూ సహకరిస్తున్నారు. అలాగే రాజీవ్ గృహకల్ప, కూన మహాలక్ష్మినగర్ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. ఈ సేవలను గుర్తించిన ప్రభుత్వం 2026 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బాలరాజును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉత్తమ విద్యను అందించేందుకు భవిష్యత్‌లోనూ తన వంతు కృషి చేస్తానని తెలిపారు.





