నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి రాజీవ్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలం దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలో ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. రానున్న పది వారాలపాటు వారానికి పది నిమిషాల చొప్పున ప్రతి ఒక్కరూ తమ ఇండ్లు, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తే సీజనల్ వ్యాధులను ఎదుర్కోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ విశ్వా ప్రసాద్, జిహెచ్ఎంసి సిబ్బంది రవీందర్, వెంకటయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.