శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోసం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ తో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేతో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీరా డైమండ్ హైట్స్, ఎన్టీఆర్ నగర్, కేశవ నగర్, నేతాజీ నగర్, నల్లగండ్ల హుడా కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్లు తీవ్రంగా దెబ్బతినడం వల్ల స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే కొత్త సీసీ రోడ్లను వేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అదే విధంగా ఇందిరా నగర్ బంజారా శ్మశాన వాటికలో సీసీ రోడ్డు, బర్నింగ్ పాయింట్, లైటింగ్ ఏర్పాటు, మెయిన్ గేట్ నిర్మాణం, బోర్‌వెల్ రిపేర్ వంటి అత్యవసర పనులను కూడా వెంటనే పూర్తి చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఓపెన్ జిమ్, లైట్ల ఏర్పాటు, బఫెలో లేక్ బ్యూటిఫికేషన్ వంటి పౌరహిత్య అభివృద్ధి పనుల కోసం జిహెచ్ఎంసి–సిఎస్‌ఆర్ నిధులు కేటాయించాలని కోరారు. ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే సానుకూలంగా స్పందిస్తూ తక్షణ అంచనాలు చేయించి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగులో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని డిప్యూటీ కమిషనర్ ని కార్పొరేటర్ కోరారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎల్లేష్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ శివ పాలేపు, వైస్ ప్రెసిడెంట్ దేవేంద్ర, జనరల్ సెక్రటరీ శృతి, కల్చరల్ సెక్రటరీ వీనస్, ఇందిరా నగర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్, ఉపాధ్యక్షుడు ధనరాజు నాయక్, జనరల్ సెక్రటరీ సంజయ్ నాయక్, ట్రెజరర్ రాజు నాయక్, సీనియర్ నాయకులు తిరుపతి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





