శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.24 కోట్ల 56 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ల పరిధిలో సీసీ రోడ్లు, వరద నీటి కాల్వలు, శ్మశానవాటికల అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొండాపూర్ డివిజన్‌లోని ప్రేమ్‌నగర్, ఓయూ కాలనీ, శ్రీరామ్‌నగర్ కాలనీల్లో రూ.5.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, శ్మశానవాటిక సుందరీకరణ, అభివృద్ధి పనులకు ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. సీసీ రోడ్లు, వరద నీటి కాల్వలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధితో కాలనీవాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రేమ్‌నగర్ శ్మశానవాటికను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్నానపు గదులు, విశ్రాంతి గదులు, ప్రహరీ గోడ నిర్మించి, ప్రశాంత వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించేలా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన రహదారులు, ట్రాఫిక్ రహిత రవాణా, అవసరమైన అన్ని మౌలిక వసతులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.





