శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్, ఇజ్జత్‌నగర్ కాలనీల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి, సంతకం చేసి బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించిన వారికి మాత్రమే ఓటరు జాబితాలో పేరు కొనసాగుతుందని, ఫారం ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా అక్‌నాలెడ్జ్‌మెంట్ (రసీదు) తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదయ్యేలా పారదర్శకంగా, వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి ప్రతి అర్హ ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న BLOలను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో BLOలు, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






