శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నారాయణ్ (JPN) నగర్ కాలనీలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి, సంతకం చేసి తప్పనిసరిగా బీఎల్‌ఓకు అందజేయాలని సూచించారు. ఫారం నింపడంలో ఏవైనా సందేహాలుంటే బూత్ లెవల్ అధికారులను సంప్రదించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి అర్హ ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్‌ఓలను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






