మియాపూర్ ఫ్లైఓవర్‌కు సోమవారం శంకుస్థాపన.. భారీగా పాల్గొనాలని ఆరెకపూడి గాంధీ పిలుపు..

శేరిలింగంప‌ల్లి, జూన్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలిచే మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయం సహా పలు అభివృద్ధి పనులకు జూన్ 8న సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, ఏర్పాట్లను పీఏసీ చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ అర్థరాత్రి వరకు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ చరిత్రలో ఒకే రోజు దాదాపు రూ.2వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడం విశేషమన్నారు. నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ ద్విముఖ (బై-డైరెక్షనల్) ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 1,790 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్‌తోపాటు హఫీజ్‌పేట్ నుంచి మియాపూర్ వరకు 3 లేన్ యూని-డైరెక్షనల్ అండర్‌పాస్, బాచుపల్లి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు మరో 3 లేన్ యూని-డైరెక్షనల్ అండర్‌పాస్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్, బాచుపల్లి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రయాణ సమయం, ఇంధన వినియోగం తగ్గుతాయని గాంధీ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీ రంగం వేగంగా విస్తరిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం HICTI ప్రాజెక్టుల ద్వారా పలు ఫ్లైఓవర్లు, రహదారి అభివృద్ధి పనులు చేపడుతోందని గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సభా ఏర్పాట్ల పరిశీలనలో డీసీలు బాలకృష్ణ, సేవా ఇస్లావత్, మాజీ కార్పొరేటర్లు, సీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు, హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. ఎస్‌ఈ శ్రీకాంతిని, ఎస్‌ఈ శంకర్ నాయక్, ఈఈ గోవర్ధన్, డీఈ ఆనంద్, డీఈ దుర్గాప్రసాద్, డీఈ వరుణ్, ఏఈ శ్రీనాథ్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here