శేరిలింగంపల్లి, జూన్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 8 సోమవారం సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. మియాపూర్ చౌరస్తా వద్ద జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రూ.530 కోట్ల వ్యయంతో మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రూ.459 కోట్లతో గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్ ఫ్లైఓవర్, రూ.220 కోట్లతో కాజాగూడ జంక్షన్ ఫ్లైఓవర్, రూ.308 కోట్ల అంచనా వ్యయంతో లింగంపల్లి ఆర్ఓబీ (ROB) ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి, రూ.100 కోట్లతో కొండాపూర్, చందానగర్ ప్రాంతాల్లో కోర్ అర్బన్ పాఠశాలల ఏర్పాటుకు కూడా శంకుస్థాపన జరగనుంది. చందానగర్ బస్‌స్టాప్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు.

మియాపూర్ చౌరస్తా వద్ద జరిగే శంకుస్థాపన కార్యక్రమం అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి, అలాగే రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చందానగర్ ప్రజల తరఫున మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం, బహిరంగ సభకు చందానగర్‌తో పాటు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.





