శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు దీక్ష దివస్ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్షా దివస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని, ఉపశమన చర్యలతో కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది, అయితే కాలం గడుస్తున్న కొద్దీ మరో ఉద్యమం పురుడుపోసుకుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారని అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009, నవంబరు 29వ తేదీన ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారని, 11 రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకంచేసిన కేసిఆర్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన తరువాత తన ఆమరణ దీక్షను విరమించారని అన్నారు.