శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో ఉన్న మాల సంఘం శ్మశాన వాటికను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మాల సంఘం శ్మశాన వాటికలో సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, బోర్‌వెల్ రిపేర్, స్నానపు గదుల ఏర్పాటు, బర్నింగ్ పాయింట్, సరిపడా లైటింగ్, మెయిన్ గేట్ నిర్మాణం వంటి మౌలిక వసతులు అత్యవసరంగా అవసరమని స్థానికులు గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ధామం ప్రతి మనిషి జీవితంలో గౌరవప్రదమైన చివరి మజిలీ. అలాంటి పవిత్ర స్థలంలో మౌలిక వసతుల కొరత ఉండకూడదు. శ్మశాన వాటికలో అవసరమైన అన్ని వసతులు కల్పించడమే మా బాధ్యత అని తెలిపారు.

మాల సంఘం శ్మశాన వాటిక అభివృద్ధికి సంబంధించి స్నానపు గదుల నిర్మాణం, బోర్‌వెల్ మరమ్మత్తులు, సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, బర్నింగ్ పాయింట్ ఏర్పాటు, లైటింగ్, మెయిన్ గేట్ నిర్మాణం, బెంచీలు ఏర్పాటు, పిచ్చి చెట్లు తొలగింపు, శుభ్రత పనులు వంటి అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలి డివిజన్‌లోని అన్ని శ్మశాన వాటికల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ నిఖిల్, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, కిషోర్, అరుణ్ గౌడ్, సుమన్, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, స్థానిక నేతలు, కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





