శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ లో ఉన్న రాజరాజేశ్వరి నగర్ కాలనీలో ఫుట్‌పాత్‌లపై నెలకొన్న ఆక్రమణలను తొలగించాలని కోరుతూ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బుధవారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ కాలనీలో గత కొంత కాలంగా కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల పాదచారులకు దారి ఉండడం లేదని, దీంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల రోడ్డు కుచించుకుపోయిందని, దీంతో తరచూ ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయని, అలాగే కాలనీలో భద్రత సమస్యలు ఏర్పడుతున్నాయని వాపోయారు.

కాలనీలోని 60 ఫీట్ రోడ్డు సర్వే నం.78-93 వరకు రహదారుల పక్కన ఫుట్ పాత్‌లపై ఆక్రమణలు వెలిశాయని, దీంతో శబ్ద, చెత్త కాలుష్యం సమస్యలు సైతం ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. దీని వల్ల వాహనదారులతోపాటు మహిళలు, చిన్నారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలపై అనేక సార్లు ఇప్పటికే సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోలేదని అసోసియేషన్ అధ్యక్షుడు S. Vijay Krishna తెలిపారు. ప్రత్యేకంగా Plot No. 502/1P వద్ద జరుగుతున్న అనధికార కార్యకలాపాలు కాలనీ వాసులకు భారీ సమస్యలు సృష్టిస్తున్నాయని, అనుమతులు లేకుండా కట్టడాలు, వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ GHMC అధికారులు కేవలం పరిశీలన చేసి వెళ్లిపోవడం తప్ప చర్య చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

వెంటనే ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని, 80 feet రోడ్‌ను అసలు స్థితికి తీసుకురావాలని, అక్రమ పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలపై పోలీస్ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే GHMC నియమాలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలనీలో శాంతి భద్రతలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ నాయకులు, కాలనీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





