శేరిలింగంపల్లి, జూన్15 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరై తమ సమస్యలు, వినతులు, సూచనలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మొత్తం 97 ఫిర్యాదులు, వినతులు స్వీకరించగా, వాటి సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖాధిపతులకు కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు.

ప్రజావాణిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి 77 ఫిర్యాదులు అందగా, ఇంజినీరింగ్ విభాగానికి 8, శానిటేషన్‌కు 3, చెరువులు (లేక్స్) విభాగానికి 2, రెవెన్యూ విభాగానికి 2, అర్బన్ బయోడైవర్సిటీకి 2, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్రాన్స్‌పోర్ట్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగాలకు ఒక్కో ఫిర్యాదు చొప్పున అందాయి. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సకాలంలో పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పరిపాలన దృష్టికి తీసుకువచ్చే ముఖ్యమైన వేదికగా ప్రజావాణి కొనసాగుతోందని, మెరుగైన సేవలు అందించడం, సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రజా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల సీఎంసీ కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు.





