రూ.90 లక్షలతో చందానగర్‌లో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం

శేరిలింగంప‌ల్లి, జూన్‌15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) నుంచి పీజేఆర్ రోడ్డు మీదుగా అపర్ణ వరకు రూ.90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఎన్‌హెచ్-65 నుంచి పీజేఆర్ రోడ్డు మీదుగా అపర్ణ వరకు రూ.90 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే కాలనీవాసులకు ఎంతో ఉపశమనం లభించడంతోపాటు ప్రయాణికులు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి రాకపోకలు మరింత సాఫీగా సాగుతాయని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని గాంధీ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల‌ను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని, చందానగర్ డివిజన్‌తోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, కాలనీవాసులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here