మార్తాండ్ నగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వ‌ద్ద‌ అగ్ని ప్రమాదం.. తక్షణమే స్పందించిన మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్..

శేరిలింగంప‌ల్లి, మార్చి 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక ట్రాన్స్‌పోర్ట్ ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు (బైకులు) పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల వేడికి ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆనుకుని ఉన్న రెండు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

విషయం తెలిసిన వెంటనే ఆయన యుద్ధప్రాతిపదికన స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి ప్రమాద తీవ్రతను వివరించారు. అగ్నిమాపక దళం ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసి వెంటనే అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపాలని కోరారు. హమీద్ పటేల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయిలో స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని హమీద్ పటేల్ అధికారులను కోరారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తులు చేపట్టి, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయన కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here