శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎయిడ్స్ పై అవగాహన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, మానవహారం కార్యక్రమాలలో తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, సైన్స్, టెక్నాలజీ శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, కలెక్టర్ నారాయణ రెడ్డి, DMHO లలిత దేవిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సమాజంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్‌ఐవీ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని, చికిత్స తీసుకోకుండా ఉంటే అది ఎయిడ్స్‌గా మారుతుందని అన్నారు.

రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి తదితర కారణాలతో హెచ్‌ఐవీ వ్యాపిస్తుందని మంత్రి రాజనర్సింహ తెలిపారు. షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదని, అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయని, అవగాహనే దీనికి సమాధానమని అన్నారు. హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని, వారికి కూడా గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ (నివారణ, నియంత్రణ) చట్టం 2017 ప్రకారం వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఒక్కప్పుడు హెచ్‌ఐవీ ప్రాణాంతక వ్యాధి అని కానీ ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి కాదని, సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే నాలుగైదు దశాబ్దాలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మెడిసిన్లను అందిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ART సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా రాజనర్సింహ యువతకు పలు సూచనలు చేశారు. అనారోగ్యకరమైన అలవాట్లతో జీవితాన్ని పాడు చేసుకోవద్దని, ఒకే చోట గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాలని, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎంత సంపాదించినా వృథాయేనని అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అది చాలా ప్రమాదకరమని. మరీ ముఖ్యంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెచ్‌ఐవీ, ఇతర రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యవంతమైన కుటుంబాలతో ఆరోగ్యవంతమైన సమాజం, బలమైన రాష్ట్రం నిర్మితమవుతాయని అన్నారు. అందరం కలిసి మరింత వైబ్రంట్ తెలంగాణను తయారు చేసుకుందాం అని మంత్రి పిలుపునిచ్చారు.





