శేరిలింగంపల్లి, మార్చి 3 (నమస్తే శేరిలింగంపల్లి): నమస్తే శేరిలింగంపల్లి 8వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంచార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు మియాపూర్ డివిజన్ FCI కాలనీలో ఉన్న పార్క్, అల్లూరి సీతా రామరాజు పార్కులను సందర్శించారు. అక్కడ అధ్వాన్నంగా ఉన్న చెత్త, చెదారం వల్ల ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉందని, చీకటి పడే సమయానికి కొన్ని అసాంఘీక కార్య కలాపాలు జరుగుతున్నట్లు స్థానిక ప్రజలు తమ జనసేన నాయకులకు వివరించడం జరిగిందని తెలిపారు. కాలనీ వాసులకు అవసరమైన పార్క్ ఎంతో కాలంగా మురికి కూపంగా మారిందని, పక్కనే ఉన్న పాఠశాల నుండి వ్యర్థపదార్థాలు నిత్యం పార్క్ పరిసరాలలో వెదజల్లడం వలన మరింత అసౌకర్యంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పార్క్ ఎంట్రన్స్ వద్ద డ్రైనేజ్ లీకేజితో అనునిత్యం చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తామని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని జనసేన పార్టీ నాయకులు అక్కడి ప్రజలకు తెలిపారు. అదేవిధంగా మధ్యలో ఆపేసిన 40ft రోడ్డు నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించాలని పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరి నాయక్, అరుణ్ కుమార్, నిరంజన్, సుధాకర్, రాహుల్, రవితేజ, విశ్వనాథ్ , పద్మావతి, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.