మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): స్పోర్ట్స్ కారుతో ఓ వ్యక్తి అతి వేగంగా, అత్యంత నిర్లక్ష్యంగా వెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఏసుబాబు అనే వ్యక్తి రహదారి పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనుకగా ఫెరారీ స్పోర్ట్స్ కారు (టీఎస్ 08 ఎఫ్‌పీ 9999)లో అతి వేగంగా వచ్చిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా కారును నడిపిస్తూ ఏసుబాబును రోడ్డుపై యువర్ కార్స్ ఎదురుగా ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలకు గురైన ఏసుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తికి ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏసుబాబు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఏసుబాబు మృతదేహం వద్ద అతని కుటుంబ సభ్యులు రోదించడం చుట్టు పక్కల అందరినీ కలచివేసింది.