శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నల్లగండ్ల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్త, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగండ్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, మానసిక ప్రశాంతత కలగాలంటే ఆధ్యాత్మికత ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.






