శ్రీశ్రీశ్రీ సగర భగీరథ మహర్షి జయంతి ఉత్స‌వాల‌కు ప్ర‌తి ఒక్క‌రు హాజ‌రు కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఈ నెల 23వ తేదీన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ‌నున్న శ్రీశ్రీశ్రీ సగర భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. గురువారం హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ఈ ఆవిష్కరణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సర్వజీవులకు ప్రాణాధారమైన గంగ (నీరును ఒంటికాలిపై కఠోరమైన తపస్సుతో దివి నుంచి భువికి తీసుకువచ్చిన మహర్షి భగీరథుడు అని అన్నారు. ఆ మహనీయుని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. హైద‌రాబాద్ రవీంద్రభారతిలో ఈ నెల 23వ తేదీన నిర్వహించే జయంతి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి సీతారాం సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు దిండి చెన్నయ్య సగర, అంజయ్య నగర్ సంఘం ఉపాధ్యక్షుడు దిండి తిరుపతయ్య సగర, హఫీజ్‌పేట్ సంఘం గౌరవాధ్యక్షుడు సాయిబాబా సగర, సంఘం నాయకులు విద్యాసాగర్, కిషోర్ సగర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here