- ట్రాన్స్‌జెండర్లు సమస్యలుంటే ఫిర్యాదు చేయవచ్చు: సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సమాజంలో నిత్యం వివక్షకు గురయ్యే హిజ్రాల సమస్యలను పరిష్కరించడం కోసం సైబరాబాద్ కమిషనరేట్‌లో కొత్తగా ట్రాన్స్‌జెండర్ డెస్క్‌ను ఏర్పాటు చేశామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో 150 మంది హిజ్రాలతోపాటు వారి తరఫున పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్‌తో సీపీ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ డెస్క్ ద్వారా హిజ్రాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. వేధింపులకు గురయ్యే వారు, ఇతర ఏమైనా సమస్యలు ఎదుర్కొనే వారు ఈ డెస్క్‌ను సంప్రదించవచ్చని సూచించారు. అయితే హిజ్రాలు చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ సమస్యలు ఏమున్నా ఆ డెస్క్ దృష్టికి తీసుకువస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సి.అనసూయ, ఏడీసీపీ క్రైమ్స్ కవిత, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, ఏసీపీలు, పోలీసు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.