పటేల్ చెరువులో గుర్రపు డెక్క నిర్మూలన.. దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు..

శేరిలింగంపల్లి, జూలై 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువులో గుర్రపు డెక్క (వాటర్ హైసింథ్) నిర్మూలన, దోమల నియంత్రణ కోసం డ్రోన్ సాయంతో హానికరం కాని కలుపు మందును పిచికారీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పటేల్ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పర్యావరణానికి హాని జరగకుండా డ్రోన్ సాయంతో కలుపు మందును పిచికారీ చేస్తున్నామని తెలిపారు. దీంతో చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క పూర్తిస్థాయిలో తొలగిపోవడంతోపాటు దోమల నియంత్రణకు కూడా దోహదపడుతుందని చెప్పారు.

పటేల్ చెరువును సుందరవనంగా తీర్చిదిద్దడంతోపాటు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని గాంధీ తెలిపారు. చెరువు అపరిశుభ్రంగా ఉండటంతో గుర్రపు డెక్క పెరిగి దోమలు అధికమవడం వల్ల స్థానికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదులు రావడంతో స్పందించి ఇప్పటికే చెరువును శుభ్రపరిచినట్లు పేర్కొన్నారు. అలాగే చెరువులో తామర పూల పెంపకం చేపట్టి, నీరు కలుషితం కాకుండా సంరక్షించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, నియోజకవర్గంలోని అన్ని చెరువులను దశలవారీగా సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here