శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ కాలనీ అలీ తలాబ్ చెరువు డ్రైనేజీ నీటితో కలుషితం అయిందని, చెత్తాచెదారంతో దుర్గంధభరిత వాసన వస్తుందని, దీంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నిజాంపేట్ రోడ్డు గుంతలమయమై వాహనదారులు నిత్యం నరకయాతన పడుతున్నారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు ముఖ్యమైన సమస్యలపై ఆయన పలు ప్రాంతాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ తో సుడిగాలి పర్యటన చేసి పరిశీలించారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ BHEL నుండి MIG కాలనీ వాసులకు ఉన్న సరిహద్దు తగాదా, రోడ్ల పరిస్థితిపై త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రామ్ నరేష్ నగర్ అసోసియేషన్ సభ్యులు ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని కుటుంబాలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి రిజిస్ట్రేషన్స్ నిలిపివేయడం విడ్డూరం అని అన్నారు. ఈ సందర్భంగా ఆలీ తలాబ్ చెరువు చుట్టూ మొక్కలు నాటి స్థానిక కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ రానున్న వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని తయారు చేయించిన మట్టి గణేశులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పధాధికారులు, డివిజన్ పదాధికారులు, జిల్లా, రాష్ట్ర, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా, నియోజవర్గ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.





