శేరిలింగంపల్లి, మార్చి 3 (నమస్తే శేరిలింగంపల్లి): డ‌్రైనేజీ నీరు ఇళ్లలోని బోర్ నీటితో కలిసి మురికిగా వస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ జలమండలి కొండాపూర్ సెక్షన్ జనరల్ మేనేజర్‌కు మార్తాండనగర్‌లోని వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండాపూర్ సెక్షన్ పరిధిలో ఉన్న మార్తాండనగర్ కాలనీ వినాయక ఆలయం 40 ఫీట్ల రోడ్డులో ఉన్న రోడ్ నం.5, 6 లలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్‌లోని నీరు భూమిలోకి ఇంకుతుందని అన్నారు. దీనివల్ల ఆ నీరు బోర్‌వెల్స్‌లోకి చేరి బోర్ నుంచి నీరు నల్లగా, మురికిగా, పసుపు రంగులో వస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయని అన్నారు. గత 15 రోజుల నుంచి ఈ రెండు రోడ్లలో ఉన్న ప్రజలు బోర్లను వాడడం మానేసి ప్రభుత్వం అందిస్తున్న నీటిపైనే ఆధార పడుతున్నారని అన్నారు. అవి సరిపోక ట్యాంకర్లను బుక్ చేసి వాడుకోవాల్సి వస్తుందని వాపోయారు. మ్యాన్ హోల్స్‌ను సరిగ్గా నిర్మించకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని అన్నారు. కనుక వెంటనే స్పందించి మ్యాన్ హోల్స్‌కు మరమ్మత్తులు చేపట్టాలని, తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షురాలు నాగనబోయిన హైమావతి తదితరులు ఉన్నారు.