నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం వెనకబడి ఉందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పట్ల ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం పరిధిలో 2000 చొప్పున డబుల్ బెడ్ రూమ్ లను నిర్మాణం చేస్తామని హామీనిచ్చిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణితో కేవలం 300 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఉచితంగా నిర్మించి ఇస్తామని హామీనిచ్చి గద్దెనెక్కగానే మరిచారని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కేవలం 300 పైగా డబుల్ బెడ్ రూమ్ లు నిర్మాణం చేయడం పట్ల ప్రజా ప్రతినిధుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. శేలింగంపల్లి నియోజకవర్గం లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీనిచ్చారని, వాటి కోసం మీ సేవ ద్వారా ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారో వివరాలు తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను అర్హులైన పేదలకు కేటాయించాలని బిజెపి తరపున డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి ఇంటికి వెళ్లిన అధికారులు పలు ప్రశ్నలు వేస్తూ, లబ్ధిదారుని ఆధార్ కార్డు ఇతరత్రా పత్రాలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం పట్ల ఖండించారు.