- ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్, అధికారులను కలిసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
- జనాలకు హెచ్చరికలు చేసిన ఆర్‌బీఐ
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): అనుమతి లేని ఇన్‌స్టంట్ యాప్‌ల ద్వారా కొందరు యథేచ్ఛగా దందా నిర్వహిస్తూ జనాల నుంచి అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేయడమే కాకుండా, అప్పులు చెల్లించని వారిని తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల, ఇతర ఆర్‌బీఐ అధికారులను కలిశారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సీపీ వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా ఆర్‌బీఐ డైరెక్టర్, అధికారులకు సీపీ సజ్జనార్ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. అనుమతి లేకుండా పలు యాప్‌ల ద్వారా కొన్ని కంపెనీలు రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. అలాంటి యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆర్‌బీఐ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు.
ప్రజలు ఇన్‌స్టంట్ యాప్ ల మాయలో పడకూడదని ఆర్‌బీఐ హెచ్చరించింది. అనుమతి లేని యాప్‌లు ప్రస్తుతం ఇన్‌స్టంట్ రుణాలను అందిస్తున్న నేపథ్యంలో యాప్‌లలో రుణాలు తీసుకునే ప్రజలు సదరు యాప్ కు ఆర్‌బీఐ నుంచి అనుమతి ఉందో, లేదో చెక్ చేసుకోవాలని సూచించింది. రుణాలు ఇచ్చే వారు ఆర్‌బీఐలో లిస్ట్ అయి ఉంటారని, అందువల్ల వారి వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే అనుమతి లేని యాప్‌లలో రుణాలను తీసుకోకూడదని తెలిపారు. అలాంటి యాప్‌లలో ప్రజలు తమ కేవైసీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయరాదని, ఇతర వివరాలను ఎంటర్ చేయకూడదని, లేదంటే మోసపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
ఇక ఇన్‌స్టంట్ లోన్ల యాప్‌ల ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వారు https://sachet.rbi.org.in అనే సైట్‌లో తమ ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలిపారు. అలాగే https://cms.rbi.org.in అనే సైట్‌ను సందర్శించడం ద్వారా ఫిర్యాదులను పరిశీలించవచ్చని అన్నారు. కాగా బాధితులు ఎవరైనా సరే డయల్ 100 నంబర్ లేదా సైబర్ క్రైమ్ పీఎస్ ఫోన్ నంబర్ 9490617310 లో సైబరాబాద్ పోలీసులను సంప్రదించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.