శేరిలింగంపల్లిలో 61,482 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి):శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ASO పుల్లయ్య, మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదల పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, పేదల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం అందించడం గొప్ప నిర్ణయమని అన్నారు. గతంలో ఉన్నత కుటుంబాలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని పేదల కంచంలోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ రెడ్డికి శేరిలింగంపల్లి నియోజకవర్గ పేద ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 61,482 రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు గాంధీ వెల్లడించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడటం తన కర్తవ్యమని, అభివృద్ధి, సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

ప్రజా పంపిణీ వ్యవస్థను సాంకేతికంగా బలోపేతం చేసి మరింత పారదర్శకంగా రేషన్ అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్డులో QR కోడ్‌తో పాటు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచినట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులభంగా తీసుకెళ్లే విధంగా కార్డులను రూపొందించినట్లు పేర్కొన్నారు. పేదలకు సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో రైతులు సన్న రకాల వరి పంటను అధికంగా సాగు చేసేలా నగదు ప్రోత్సాహకం అందించడం సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనమని గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు పొందాలని సూచించారు. పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో మరిన్ని రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని, ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here