నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మొదలైన నుండి అనేక రకాలుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యురిటి సంస్థ సభ్యులు మరో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ లక్షణాలతో సందిగ్ధంలో ఉన్న వ్యక్తులు, పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలాషన్ ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలియని వారికి వైద్య సలహాలు అందించేందుకు ఉచిత కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్ సేవల ప్రారంభోత్సవ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ మాట్లాడుటూ హైదరాబాద్ నగరంలో వైద్యరంగం చాలా సంక్లిష్టమై ఉందని కోవిడ్ సమయంలో సామాన్య ప్రజలకు వైద్యసేవలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు తాము భావించామని తెలిపారు. కోవిడ్ విషయంలో ఎలాంటి సందేహాలకైనా ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఎస్సిఎస్సి సెక్రటరీ జనరల్ కృష్ణ ఎదుల మాట్లాడుతూ కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, పాజిటివ్ గా తేలిన వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి వైద్య సేవలు పొందాలో +918045811138 నెంబరులో టెలి మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. కాల్ సెంటర్లో ప్రజల సందేహాలు తీర్చేందుకు వాలంటరీగా సేవలు అందిస్తున్న కాంటినెంటల్, సన్ షైన్, సిటిజన్, మెడికోవర్, ఎస్ ఎల్ జి, ఏ ఐజీ ఆసుపత్రి వైద్యులకు కమీషనర్ సజ్జనార్, కృష్ణ ఎదుల, ఎస్సిఎస్సి హెల్త్ కేర్ వర్టీకల్ జాయింట్ సెక్రటరీ డా.రాజీవ్ మీనన్ కృతజ్ఞతలు తెలిపారు.