సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): స్నిఫర్ డాగ్స్‌గా ప్రత్యేక శిక్షణ పొందిన లూసీ, డెయిసీ అనే రెండు శునకాలతోపాటు వాటికి ట్రెయినింగ్ ఇచ్చిన సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ బీడీ టీమ్ పోలీస్ కానిస్టేబుల్స్ కె.సురేష్, ఎల్.మహేందర్ లను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ శుక్రవారం సన్మానించారు. సదరు శునకాలు 8 నెలల పాటు మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ట్రెయినింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణ పొందాయని తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీన ఐఐటీఏలో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు గాను లూసీ అనే శునకానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండో బహుమతి వచ్చిందన్నారు. ఆ రెండు శునకాలు బాంబ్ స్క్వాడ్ కోసం పనిచేస్తాయన్నారు. వాటికి శిక్షణ ఇచ్చిన మహేందర్, సురేష్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి ఆయన నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సీఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సీఎస్‌డబ్ల్యూ బీడీ టీమ్ ఆర్ఐ శ్రీనివాస్, సీఎస్‌డబ్ల్యూ డాగ్ స్క్వాడ్ హెచ్‌సీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.