గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), టాలెంట్ స్ప్రింట్ అనే సంస్థలు సంయుక్తంగా ఐవోటీ అండ్ స్మార్ట్ అనలిటిక్స్‌లో పీజీ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించాయి. ఈ మేరకు ట్రిపుల్ ఐటీ, టాలెంట్ స్ప్రింట్ ల ప్రతినిధులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 9 నెలల కాలవ్యవధి కలిగిన ఆ కోర్సుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఐవోటీ ఇంజినీర్లు, అనలిటిక్స్‌లో ప్రావీణ్యం పొందాలనుకునేవారికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కోర్సుకు జూన్ నుంచి తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. ఎంపిక చేయబడిన కొద్ది మంది గ్రాడ్యుయేట్లు కూడా ఈ కోర్సులో చేరుతారని, అందరికీ ప్రత్యక్ష, ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తామని తెలియజేశారు. మరిన్ని వివరాలకు iiit-h.talentsprint.comi/iot/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.