శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా ఇజ్జత్నగర్, మాతృశ్రీనగర్ వార్డుల్లో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. కూకట్పల్లి జోన్, మాదాపూర్ సర్కిల్ పరిధిలో జరిగిన ఈ పర్యటనలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి. గాంధీ, డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై హింద్ పార్క్, గోకుల్ ప్లాట్స్ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల RWA ప్రతినిధులు, స్థానిక నివాసులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానంగా రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, సీవరేజ్, వీధి దీపాలు, తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు, పార్కుల నిర్వహణ, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, బహిరంగంగా చెత్త వేయడం, కమ్యూనిటీ సదుపాయాలు తదితర అంశాలను ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ప్రస్తావించిన ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో నమోదు చేసి, విభాగాల వారీగా సమీక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంతో పాటు, అవసరమైన చోట ఇతర లైన్ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని సకాలంలో చర్యలు చేపట్టాలని సూచించారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తూ పౌరులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌర సేవలు అందించేందుకు సీఎంసీ చర్యలు కొనసాగిస్తోంది.





