శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను శేరిలింగంపల్లి పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొమిరిశెట్టి సాయిబాబా కోరారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్‌లో కమిషనర్ సృజనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన సాయిబాబా.. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హత ఉన్నప్పటికీ పలువురికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకుని గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి అర్హులను గుర్తించి పథకాల ప్రయోజనాలు అందించాలని వినతిపత్రంలో కోరారు. సాయిబాబా విజ్ఞప్తిపై కమిషనర్ సృజన సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, బొబ్బ నవత రెడ్డి, మారబోయిన రవి యాదవ్, సంగారెడ్డి, రోజాతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





