శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్, రాయదుర్గం, నల్లగండ్ల హుడా కాలనీ, నానక్ రామ్ గూడలలో సీసీ రోడ్లు దెబ్బ తినడం వల్ల చిన్నపాటి వర్షానికి గుంతలలో నీరు నిలిచి స్థానిక ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, తక్షణమే నూతన రోడ్లు వేయించాలని కోరారు.
అలాగే గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జనాభా దృష్ట్యారోడ్డు వెడల్పు కూడా చేయవలసిన అవసరం ఉందని కోరారు. డివిజన్ విస్తారమైన ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారని, స్థానికుల మౌళిక వసతుల కోసం తగిన నిధులు మంజూరు చేయాలని అన్నారు. దీనికి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ దుర్గాప్రసాద్, డీఈ విశాలాక్షి, డీఈ ఆనంద్, ఏఈ రషీద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంచందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు రాయుడు, సీనియర్ నాయకుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.